పొన్నూరు మున్సిపాలిటీలో రూ.32.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


పొన్నూరు మున్సిపాలిటీలో రూ.32.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మౌలిక వసతుల అభివృద్ధికి రూ.126.28 కోట్లు ఖర్చు చేస్తున్నాం. - మంత్రి పొంగూరు నారాయణ.

గుంటూరు.తేజ పత్రిక,ప్రతినిధి
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.32.10 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు.గాంధీ జయంతి సందర్భంగా పొన్నూరులోని మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి నారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మొక్కలు నాటారు.

పొన్నూరు అభివృద్ధికి రూ.126.28 కోట్లు

పొన్నూరు మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం రూ.126.28 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రూ.32.10 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.అమృత్ 2.0 పథకం కింద రూ.22.10 కోట్లతో నీటి సరఫరా పనులు, నాగుల చెరువు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే సీఆర్డీఏ నిధులతో రూ.10 కోట్లతో సీసీ రోడ్లు, గ్రీనరీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి వివరించారు.పొన్నూరు మున్సిపాలిటీకి హ్యామ్ ప్రాజెక్టు కింద రూ.28 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి యూసీఎఫ్, యూఐడీఎఫ్ ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూర్చుతున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.

అమరావతి అత్యంత సురక్షితమైన నగరం

అమరావతి రాజధాని అత్యంత సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో చేపడుతున్న వరద నియంత్రణ పనులు పూర్తయిన తర్వాత నీరు నిలిచే సమస్య ఉండదని స్పష్టం చేశారు.అమరావతి వరద నియంత్రణ వ్యవస్థను నెదర్లాండ్స్ నిపుణుల సహకారంతో రూపొందించినట్లు మంత్రి తెలిపారు. గత 200 ఏళ్ల వర్షపాత పరిస్థితులను అధ్యయనం చేసి వరద నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన డిజైన్లను రూపొందించినట్లు వివరించారు.

22,500 క్యూసెక్కుల నీటిని బయటకు పంపేలా వ్యవస్థ

అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ వంటి మూడు ప్రధాన కాలువలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. భారీ వర్షాల సమయంలో నీటిని వేగంగా బయటకు పంపించేలా 22,500 క్యూసెక్కుల నీటిని బయటకు తరలించే సామర్థ్యంతో పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రెంచుల్లో వర్షపు నీరు కనిపిస్తోందని, పనులు పూర్తయ్యే దశలో ఈ సమస్య ఉండదని మంత్రి స్పష్టం చేశారు. రాజధానిలో వరద నీటి నిర్వహణకు శాస్త్రీయంగా, సమగ్రంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.

అమరావతి అభివృద్ధిపై కొందరు పనిగట్టుకుని రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనించాలని సూచించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ, వరద నియంత్రణ, నీటి సరఫరా తదితర మౌలిక వసతుల పనులను సమగ్రంగా చేపడుతున్నామని తెలిపారు.

ప్రతి ఒక్కరికీ శుద్ధి చేసిన తాగునీరు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, శుద్ధి చేసిన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. పట్టణాల్లో నీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, డ్రైనేజీ, రోడ్లు, గ్రీనరీ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.పొన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చి, ప్రజలకు మెరుగైన పట్టణ మౌలిక వసతులు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని మంత్రి నారాయణ తెలిపారు.



Post a Comment

Previous Post Next Post

Janani Web Solutions

Janani Web Solutions

📅 Today Views: Loading...
👁️ Total Views: Loading...